1, ఆగస్టు 2011, సోమవారం

The Great Escapist పల్లెటూళ్ళో



మా టీచర్లని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల ఆర్ధిక స్థోమత ఎంతో సర్వే చేయమని ఓ సారి పంపించారు. ప్రతి ఇంటికీ వెళ్ళి ఆ యజమాని యొక్క వృత్తి, ఆదాయ వివరాలను కనుక్కోవటం మా పని. ఈ సర్వేలో ఎన్నో చిత్రమైన విషయాలు బయటపడ్డాయి. వాటిలో ఓ వింత అనుభవాన్ని మీకు చెబుతాను. రామచంద్రాపురం అనే గ్రామంలో ఓ ఇంటికి వెళ్ళేను. పాతిక సంవత్సరాల వయసు కలిగి, దృఢమైన శరీరంతో ఓ వ్యక్తి మంచం మీద పడుకుని ఉన్నాడు. అఫ్ఫుడు సమయం ఉదయం పది గంటలు. కాసేపు అతనితో మాట్లాడితే తెలిసిన విషయమేమంటే, అతని భార్య కూలి పనికి పొలానికి వెళ్ళింది. ఆమె రోజూ కూలి పని చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉందట. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను అతన్ని అడిగాను "ఏమండీ! మీరు ఈ కుటుంబ యజమాని కదా! మరి మీరు ఏ పని చేస్తుంటారు?" దానికి ఆయన చెప్పిన సమాధానం విని అవాక్కయ్యాను. "నేను ఏ పనీ చేయను. నాకు ఎండ గిట్టదు." అయితే లోతుగా విచారిస్తే అతనికి అలర్జీ వ్యాధి ఉందని నాకు అర్ధమైంది. అప్పుడు అతనికి వైద్యుని దగ్గరకు వెళ్ళి సరైన వైద్యం చేయించుకుంటే ఆరోగ్య వంతంగా తయారయ్యి మీ కుంటుంబాన్ని పోషించే విధంగా తయారవుతారని ఉచిత సలహా ఇచ్చాను నా బాధ్యతగా. ఆ మాటలు విని ఒకింత ఆశ్చర్యంగా మరికొంత అమాయకంగా ఇలా అన్నాడు "నాకు సూది పడదండి! అంటే నాకు సూది మందంటే చాలా భయం. అందువలన ఆసుపత్రికి వెళ్ళను"
ఇది పని తప్పించుకోవటమో లేక నిజంగానే అతనిదొక సమస్యో నాకు అర్ధం కాలేదు. ఇంకా బోలెడు ఇళ్ళు తిరగాల్సి ఉండటంతో నా సర్వేలో నేను మునిగి పోయాను. కాని ఈ సంఘటన గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇలాంటి కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోకుండా మీరైతే ఎలాంటి సూచనలు ఇస్తారు?