24, జులై 2011, ఆదివారం

మానవత్వమా!...దీనికంటే గొప్పది ఉందా?



ఒక రోజు ఉదమయం పది గంటల ప్రాంతం. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి ట్రంకురోడ్డు పై, ఓ కోతి ఏదో వాహనం క్రింద పడి చనిపోయి ఉంది. రోడ్డుపై ఎంతోమంది జనం అంటే నాతో సహా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అటూ ఇటూ ఎవరి ధోరిణిలో వారు వెళ్తూ ఉన్నారు. ఆ సమయం లో మరో కోతి ట్రాఫిక్ ను తప్పించుకుంటూ వచ్చి ఆ చనిపోయిన కోతిని ఎత్తి భుజంపై వేసుకోవటానికి ఎంతో ప్రయత్నించింది. అది భుజాన వేసుకోవటం, జారిపోవటం... కాసేపు ఎడం వైపు మరోసారి కుడి వైపు భుజం మీద వేసుకుంటూ వచ్చే పోయే వాహనాల బారినుండి దాన్నీ తప్పిస్తూ, తను తప్పించుకుంటూ కనీసం ఓ గంట సేపు ప్రయత్నించింది. చివరికి ఆ కోతిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సంఘటనని చూస్తూ నిలబడిపోయిన మేము మానవత్వం కంటే గొప్పదైన ఏదో శక్తి ఉందని భారమైన మనస్సుతో అక్కడినుంచి కదలిపోయాము.

'ఆ బ్రతికి ఉన్న కోతి ఉద్దేశ్యం చనిపోయిన కోతిని దిక్కులేకుండా అనాధగా వదిలివేయకుండా ఉంచడమే" అన్న విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సు దిగులుగా అయిపోతుంది.

20, జులై 2011, బుధవారం

నా దబరని కాపాడండి సారో!!!



1995 వ సంవత్సరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలం, పెద్దవరం ప్రాధమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా నేను, అసిస్టెంట్ గా పనిచేస్తున్న జిలాని భాషా పని చేస్తున్న సమయంలో ఎదురైన అరుదైన అనుభవం ఇది.

ఓ మధ్యాహ్నం భోజనానికని ఇంటికి వెళ్ళిన ఓ విధ్యార్ధి ఆడుకుంటూ తన తలను ఓ దబరలో మెడవరకు దూర్చి తిరిగి తీయలేక పోయాడు. ఎంత ప్రయత్నం చేసినా దాన్ని తిరిగి తీయలేక పోయారు. ఆ విషయం మా దృష్టికి రావటంతో, హుటా హుటిన వాడి దగ్గరకి వెళ్ళి తలను జాగ్రత్తగా తీయటానికి ప్రయత్నింఛాము, కాని మాకు సాధ్య పడలేదు. అది ఒక మారుమూల గ్రామం కావటం అంతేకాక బస్ మరియు రోడ్ సౌకర్యం కూడా లేకపోవటం వల్ల ఈ రోజుల్లోలాగా 108 సౌకర్యం లేకపోవటం వల్ల ఏమి చేయాలో తోచలేదు. టీచర్లం కావటంతో ఆ సమస్యని తీర్చే బాధ్యత మా భుజాల మీద పడింది. అప్పుడు ఎక్కడినుండో అక్సా బ్లేడ్ సంపాదించి దానితో ఆ దబరని జాగ్రత్తగా కోయటం మొదలు పెట్టేము. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి " సార్!! ఆ దబరని వంద రూపాయలు పెట్టి నిన్నే మా ఆయన కొన్నాడు సార్!! అది పాడయితే మా ఆయన కొడతాడు. ఆ దబరని జాగ్రత్తగా చూడండి సార్! " అని వేడుకుంది.

వాడి తలకి ఆ బ్లేడ్ తగిలి ఎక్కడ గాయంవుతోదోనని మా భయం, అదీ గాక గాలి ఆడక ఇంకేదైనా ప్రమాదం జరుగుతుందేమో నని ఆందోళనతో ఉన్న మాకు ఆమె అన్న మాటలకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాక ఒకరి ముఖాలు మరొకరం చూసుకున్నాం.